Karimnagar District: మానవత్వం పరిమళించింది.. తల్లీబిడ్డలను కాపాడిన ఆర్టీసీ సిబ్బందిపై సజ్జనార్ ప్రశంసలు

TGRTS female staff of karimnagar bus stand helps pregnant woman deliver baby

  • కరీంనగర్‌ బస్టాండ్‌లో అకస్మాత్తుగా మహిళకు పురిటినొప్పులు
  • చీరలు అడ్డుకట్టి ప్రసవం చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది
  • 108 అంబులెన్స్ రాగానే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు   

కరీంనగర్ బస్‌స్టాండ్‌లో అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమైన గర్భవతికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్‌వైజర్లపై టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసలు కురిపించారు. మానవత్వం పరిమళించిందంటూ అభినందనలు తెలియజేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డల ప్రాణాలు నిలిచాయన్నారు. ప్రజలకు రవాణా సేవలు అందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపించారని అన్నారు. 

అసలేం జరిగిందంటే.. 
ఊరెళ్దామని కరీంనగర్ బస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ గర్భిణికి అక్కడే నొప్పులు మొదలవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. 

ఒడిశాకు చెందిన వలస కూలి కుమారి ఆమె భర్త దూలతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నల్లి ఇటుక బట్టీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కుంట వెళ్దామని కరీంనగర్ బ‌స్టాండ్‌లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. కుమారి నిండు గర్భిణి కాగా, ఆమెకు బస్టాండ్‌లోనే నొప్పులు మొదలయ్యాయి. వెంటనే భర్త ఆమెను పక్కన పడుకోబెట్టి సాయం కోసం ఆర్టీసీ అధికారులను వేడుకున్నాడు. దీంతో, వారు 108కు సమాచారమిచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్‌వైజర్లు ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి సాధారణ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. కొద్దిసేపటికి  108 అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డలను కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. గర్భవతికి అండగా నిలిచిన సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

More Telugu News