Palla Sriniavasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం

Palla Srinivasarao appointed as AP TDP Chief

  • ఏపీ టీడీపీకి కొత్త సారథి
  • పల్లా శ్రీనివాసరావు నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • పల్లా శ్రీనివాసరావు సమర్థుడని కితాబు
  • గత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సేవలను కొనియాడిన టీడీపీ అధినేత

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేశారని, ఆయన నూతన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరును కనబర్చిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చంద్రబాబు ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కెల్లా ఇదే అత్యధిక మెజారిటీ.

More Telugu News