Rishikonda Palace: అది మీ పైత్యం... రుషికొండ భవనాలపై స్పందించిన వైసీపీ

YCP reacts to TDP comments on Rishikonda constructions

  • రుషికొండ భవనాలను పరిశీలించిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు
  • వైసీపీ నాయకత్వంపై విమర్శలు
  • రుషికొండలో ఉన్నది ప్రైవేటు ఆస్తులు కాదన్న వైసీపీ
  • అవి ప్రభుత్వ భవనాలేనని స్పష్టీకరణ

రుషికొండలో భవనాలను టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పరిశీలించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ స్పందించింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని స్పష్టం చేసింది. 

రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ... విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించింది. 

"రుషికొండలో ఉన్నది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. ఆ భవనాలు ఎవరి సొంతం కూడా కావు. విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలు నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టం. అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు  జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 

1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రులు, గవర్నర్ లు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

More Telugu News