East Godavari District: బ్యాటరీ మింగిన 11 నెలల చిన్నారి.. కాపాడిన వైద్యులు
- పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం ఘటన
- చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో తప్పిన ప్రమాదం
- శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతో బ్యాటరీని తొలగించిన వైద్యులు
బ్యాటరీ మింగిన నెలల వయసున్న చిన్నారిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావని జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. అంబులెన్స్‌లో చిన్నారిని హుటాహుటిన విజయవాడకు తరలించారు.
విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు చిన్నారికి ఎక్స్‌రే తీసి చూడగా.. బ్యాటరీ కడుపు, ఛాతి మధ్య భాగంలో కనిపించింది. దీంతో, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు అన్నారు. చిన్నారికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి పంపించేశామని పేర్కొన్నారు.