Raja Singh: ఏపీలో జగన్ ఓటమిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh Hot comments on Jagan defeat

  • జగన్ పాలనలో తిరుమల, శ్రీశైలం క్షేత్రాలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని విమర్శ
  • జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపణ
  • అన్నింటిని గమనించిన ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టారన్న రాజాసింగ్

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ భారీ ఓటమిపై తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో తిరుమల, శ్రీశైలం పుణ్యక్షేత్రాలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీని ఓడించారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేశారు.

ఓం నమో వెంకటేశాయ అంటూ వీడియోను ప్రారంభించారు. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలపై దాడులు చేశారని ఆరోపించారు. కన్వర్టెడ్ క్రిస్టియన్‌కు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. ఇది జగన్ చేసిన పెద్ద తప్పు అన్నారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారన్నారు. మాంసం, మందు కొండపైకి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటన్నింటిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ను ఓడించి... కూటమికి పట్టం గట్టారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగానే కొనసాగితే ఏపీలోని హిందువుల, ప్రాచీన ఆలయాలు సురక్షితంగా ఉండవని గ్రహించారన్నారు. ఏపీలోని దేవాలయాలు హిందూ ధర్మాన్నే ప్రచారం చేయాలని సూచించారు. ఆలయాల్లో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఉండాలన్నారు. టీటీడీలో చైర్మన్, బోర్డు మెంబర్లు హిందువులే ఉండాలన్నారు.

More Telugu News