Annamalai: తమిళిసై వీడియో రగడకు తెరదించిన అన్నామలై

Annamalai met Tamailisai in Chennai

  • ఇటీవల తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • నిన్న చెన్నైలో తమిళిసై నివాసానికి వెళ్లిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
  • అక్కను కలవడం ఎంతో సంతోషం కలిగించిందని వెల్లడి 
  • ఆమె కష్టపడి పనిచేసే నేత అని కితాబు

ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో... కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ గవర్నర్ ను తమిళిసై సౌందర్ రాజన్ తో హెచ్చరిస్తున్న ధోరణిలో  మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన వీడియో తమిళనాడులో ఆగ్రహావేశాలు రగిల్చింది. 

కోయంబత్తూరు లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు అని తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని ఆ వీడియోపై ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని తమిళిసై ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో ఎదురైన సవాళ్లు, తమిళనాడులో రాజకీయ పరిస్థితుల గురించే అమిత్ షా తనతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నామలై నిన్న చెన్నైలో తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఈ భేటీపై అన్నామలై సోషల్ మీడియాలో స్పందించారు. తమిళిసై అక్కను కలిశానని, ఈ భేటీ తనకెంతో సంతోషదాయకమని వెల్లడించారు. 

తమిళిసై రాజకీయ అనుభవం, సలహాలు తమిళనాడులో పార్టీ అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు. ఆమె చాలా కష్టించి పనిచేసే నేత అని కొనియాడారు. తమిళిసై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు, తమిళనాడులో కమలం తప్పకుండా వికసిస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉండేవారని, ఆ దిశగా ఆమె ఎంతో కృషి చేశారని అన్నామలై తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Annamalai
Tamilisai Soundararajan
BJP
Tamil Nadu
  • Loading...

More Telugu News