South Africa Vs Nepal: ఒక్క రన్ తేడాతో దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన నేపాల్!
- కింగ్‌స్టన్ వేదికగా దక్షిణాఫ్రికా, నేపాల్ మ్యాచ్
- ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో సఫారీ టీమ్ విజయం
- దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులు
- లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులే చేసిన నేపాల్
2024 టీ20 ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. కింగ్‌స్టన్ వేదికగా దక్షిణాఫ్రికా, నేపాల్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో పసికూన నేపాల్ త్రుటిలో పొట్టి వరల్డ్‌కప్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికాను 115లకు పరిమితం చేసిన నేపాల్ జట్టు.. ఆ తర్వాత 116 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులే చేసింది.
ఆఖరి ఓవర్‌లో నేపాల్‌కు ఎనిమిది పరుగులు కావాలి. ఈ దశలో దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతిని బ్యాటర్ గుల్షన్ ఝా బౌండరీకి తరలించాడు. నాలుగో బంతికి రెండు రన్స్ వచ్చాయి. దీంతో సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారిపోయింది. అంతే నేపాల్ చారిత్రాత్మక విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, చివరి రెండు బంతులు కూడా డాట్స్ కావడం వల్ల నేపాల్ కు పరాజయం తప్పలేదు. ఆఖరి బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో గుల్షన్ ఝా పరుగుకు యత్నించాడు. కానీ, రనౌట్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రీజా హెన్రిక్స్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డికాక్ (10), మర్క్రమ్ (15), క్లాసెన్ (3), డేవిడ్ మిల్లర్(7) ఫెయిల్ అయ్యారు. చివర్లో స్టబ్స్ (27*) బ్యాట్ ఝుళిపించాడు. ఇక నేపాల్ బౌలర్లలో కుశాల్ 4, దీపేంద్ర సింగ్ 3 వికెట్లు తీశారు.
ఇక ఈ పరాజయంతో నేపాల్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటివరకు ఆ జట్టు మూడు మ్యాచ్ లు ఆడి రెండిట్లో ఓడింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఇక జూన్ 16న బంగ్లాతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా గ్రూప్ స్టేజీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 8 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.