Ramoji Rao Statue: కోనసీమలో రూపుదిద్దుకుంటున్న రామోజీరావు విగ్రహం
- ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహం తయారీ
- ఎంపీ అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని రూపొందిస్తున్న శిల్పి రాజకుమార్ వడయార్
- ఈ విగ్రహాన్ని విశాఖలో ప్రతిష్ఠిస్తామన్న అప్పలనాయుడు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా మొఘల్ రామోజీరావు విగ్రహం ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజకుమార్ వడయార్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిమ తుది మెరుగులు దిద్దుతున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలియజేశారు.
అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. ఏడున్నర అడుగుల ఈ విగ్రహానికి కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. తాజాగా అప్పలనాయుడు విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖపట్నంలో ప్రతిష్ఠిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా, భావితరాల వారికి ఆయన గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తెలిపారు. అలాగే నవంబర్ 16న రామోజీరావు 89వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 25 విగ్రహాలు పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ నెల 8న రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.