Jharkhand: రైలులో మంటలు అంటుకున్నాయని పుకారు.. భయంతో రైలు నుంచి దూకి ముగ్గురు ప్రయాణికుల మృతి
- ఝార్ఖండ్‌లోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- ట్రాక్‌పై దూకడంతో గూడ్స్ రైలు ఢీకొని మృతి
- నక్సల్స్ చర్యపై అనుమానం!
రైలులో మంటలు చెలరేగాయన్న పుకార్లు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. ఝార్ఖండ్‌లోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. రాంచీ-ససరామ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అంటుకున్నాయన్న పుకార్లతో ముగ్గురు ప్రయాణికులు భయంతో రైలు నుంచి దూకేశారు. అదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న గూడ్స్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి (ప్రయాణికుడు కాదు) ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన రైలును నిలిపివేశారు. ఆ వెంటనే భయంతో ముగ్గురు వ్యక్తులు ట్రాక్‌పైకి దూకేశారు. ఈ ఘటన వెనక ఏదైనా లక్ష్యం ఉందా? లేదంటే నక్సల్స్ చర్యా? అన్న కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.