Ponguleti Srinivas Reddy: ధరణి పోర్టల్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
- ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడి
- గత ప్రభుత్వం హడావుడిగా ఈ పోర్టల్‌ను తీసుకువచ్చిందని విమర్శ
- పోర్టల్ సమస్యలపై అధ్యయనం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు వెల్లడి
ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పోర్టల్ వల్ల లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. శుక్రవారం నాడు ఆయన ధరణి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ధరణి పోర్టల్‌ను పునర్ వ్యవస్థీకరించి, భూ వ్యవహారాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
గత ప్రభుత్వం హడావుడిగా ఈ పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. దీంతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. వాటిని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. ఈ కమిటీ సిఫార్సులపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ... భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించిందన్నారు.
18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ యాక్టును క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని సూచించిందన్నారు. ధరణి పోర్టల్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా... అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టబోతున్నట్లు చెప్పారు.