Vangalapudi Anitha: కొందరు పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

Home minister warns some police officers

  • ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత
  • చంద్రబాబు, పవన్, లోకేశ్, ఎన్డీయే నేతలకు అనిత కృతజ్ఞతలు
  • రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకువస్తామని వెల్లడి 
  • చంద్రయ్య హత్య వంటి కేసులను రీ ఓపెన్ చేస్తామని స్పష్టీకరణ

పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంగలపూడి అనితకు అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను కేటాయించడం తెలిసిందే. దీనిపై అనిత స్పందించారు. 

తనకు హోంశాఖ అప్పగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎన్డీయే నేతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకువస్తామని అనిత చెప్పారు. కొంతమంది పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మార్పు రాకపోతే తామే మార్చుతామని హెచ్చరించారు. 

మాచర్లలో చంద్రయ్య హత్య వంటి  కేసులను రీ ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అక్రమ కేసులపై సమీక్ష జరుగుతోందని అన్నారు. 

"పోలీసు శాఖను కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం. లేని దిశా చట్టాన్ని ఉన్నట్టు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించింది. మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడేలా మా ప్రభుత్వ చర్యలు ఉంటాయి. మహిళల భద్రత విషయంలో రాష్ట్రంలోని మహిళా సంఘాల సూచనలు తీసుకుంటాం. గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటాం. 

పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు... మా ప్రభుత్వం అలాంటిది కాదు. అయితే, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం మా బాధ్యతగా భావిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు నాపైనే అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసం... వారు చట్టప్రకారం పనిచేయాలి.

గత ప్రభుత్వంలో చాలామంది ఐపీఎస్ లు  జగన్ కు, వైసీపీకి తొత్తులుగా పనిచేశారు. గత ఐదేళ్లలో చాలామంది ఐపీఎస్ లు వారి గౌరవాన్ని వారే తగ్గించుకున్నారు. ఐపీఎస్ లు, పోలీసు అధికారుల గౌరవాన్ని పెంచేలా మా పాలన ఉంటుంది. ఇప్పటికీ వైసీపీ ఆలోచనలతోనే పనిచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. 

గత ప్రభుత్వంలో పోలీసులతో ఎన్నో బాధలు పడ్డాం. మహిళలపై దాడుల అంశంలో డీజీపీకి వినతిపత్రం కూడా ఇవ్వనీయలేదు. త్వరలోనే ప్రోటోకాల్ తో వస్తానని ఆ రోజే పోలీసులకు చెప్పాను. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు, అందరూ సురక్షితంగా ఉండాలన్నదే మా అభిమతం. 

ఇక, పోలీసు సిబ్బందికి అందాల్సిన బకాయిలపై నేను బాధ్యతలు చేపట్టాక సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం" అని అనిత వివరించారు.

ఇక, వంగలపూడి అనిత బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే... ఆమె గతంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.  

తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రాణించారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి హోం మంత్రి పదవిని అందుకున్నారు.

  • Loading...

More Telugu News