Raghunandan Rao: వెంకట్రామిరెడ్డికి ఆ డబ్బులు ఎక్కడివి?... ఆయనను వదిలే ప్రసక్తే లేదు: రఘునందన్ రావు
- గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని వెంకట్రామిరెడ్డి చెప్పారన్న బీజేపీ నేత
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా లేకుండా పీకేశామన్న రఘునందన్ రావు
- కాళేశ్వరం అక్రమాలపై చర్యలకు సీఎం వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణ
- హరీశ్ రావు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్న
- తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆగ్రహం
- ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపాటు
మెదక్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చెప్పారని... ఆ డబ్బులు ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంకట్రామిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టఫలితమే బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జెండా లేకుండా పీకేశామని... ఇక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం అక్రమాలపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. నాటి మంత్రి హరీశ్ రావు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నాడని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో తప్పులు చేసిన వ్యక్తి ఎందుకు కనిపించడం లేదన్నారు.
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని రఘునందన్ రావు విమర్శించారు. సుల్తానాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ముక్కుపచ్చలారని పసిపాపను రేప్ చేసి చంపేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణం జరిగితే షీ టీమ్‌లు ఏం చేస్తున్నాయి? సీసీ కెమెరాలు ఏవి? ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.