ACB: లంచం డబ్బు తీసుకుంటుండగా కనిపించిన ఏసీబీ అధికారులు.. నడిరోడ్డుపై ఎస్సై పరుగో పరుగు!

Ch Sudhakar Inspector of Police EOW CCS Hyderabad was caught by ACB Officials

  • ఓ కేసులో నిందితుడితో చేయి కలిపిన ఇన్‌స్పెక్టర్
  • తొలుత రూ. 5 లక్షల అడ్వాన్స్
  • నిన్న రూ. 3 లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన సీఐ
  • హైదరాబాద్‌లో ఘటన

ఓ కేసులో నిందితుడికి ఫేవర్ చేస్తానని రూ. 15 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఇన్‌స్పెక్టర్ రూ. 3 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో అటుగా వస్తున్న వారు ఏసీబీ అధికారులేనని గుర్తించాడు. ఆ డబ్బు అక్కడే వదిలేసి రోడ్డుపై పరుగులు పెట్టాడు. ఏసీబీ అధికారులు చేజ్ చేసి పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ‘దొంగాపోలీస్’ ఆటను తలపించింది.

తన వ్యాపార విస్తారణకు సలహాలిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ బోయిన్‌పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ (45)పై అల్వాల్‌కు చెందిన ఫార్మా వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ (56) సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఈవోడబ్ల్యూ టీం-7 ఇన్‌స్పెక్టర్ చామకూర సుధాకర్ దర్యాప్తు చేస్తున్నాడు. సీఐని కలిసిన నిందితుడు మణిరంగస్వామి కేసును మాఫీ చేయాలంటూ బేరసారాలు మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య రూ. 15 లక్షలకు బేరం కుదిరింది. అందులో భాగంగా గతంలో రూ. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు.

సీఐ పరుగో పరుగు
గురువారం సాయంత్రం 5.30 గంటలకు సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఉండే పార్కింగ్ ప్రదేశం వద్ద సుధాకర్‌ను కలిసిన మణిరంగస్వామి రూ. 3 లక్షలు ఇచ్చాడు. అదే సమయంలో తనవైపు వస్తున్నవారు ఏసీబీ అధికారులుగా గుర్తించిన సుధాకర్ డబ్బున్న బ్యాగును అక్కడే వదిలేసి నడిరోడ్డుపై పరుగులు పెట్టాడు. అప్రమత్తమైన ఏసీబీ సీఐ సతీశ్, ముగ్గురు కానిస్టేబుళ్లు వెంటాడి సుధాకర్‌‌ను పట్టుకున్నారు. 

ఆ పై అతడి చేతుల్ని పరీక్షించగా, లంచం డబ్బులపై అధికారులు పూసిన పౌడర్ అంటుకుని ఉండడంతో అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. కాగా, నిందితుడు సుధాకర్ చరిత్ర మొత్తం అవినీతి మయమేనని అధికారులు తెలిపారు. అధికారులు అతడిని పలుమార్లు బదిలీ చేసినా బుద్ధిమార్చుకోలేదు. చివరికి ఇలా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News