Revanth Reddy: పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవడంపై దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం

Deshapathi srinivas fires at CM Revanth Reddy

  • 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పాత పుస్తకాలనే కొనసాగించామని వెల్లడి
  • ఇప్పుడు ముందుమాటలో కేసీఆర్ పేరు ఉండటాన్ని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని విమర్శ
  • భేషజాలు లేవని చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తుందేమిటని నిలదీత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని... అందుకే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిందని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం (నాడు టీఆర్ఎస్) వచ్చాక కొత్త పుస్త‌కాలు రూపొందించలేదని... పాత పుస్త‌కాల‌నే కొన‌సాగించామని గుర్తు చేశారు. నాడు ఉమ్మ‌డి ఏపీలో ఉన్న సిల‌బ‌స్‌నే చ‌దువుకున్నారని తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ఎడిట‌ర్లు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పేర్లు యథావిధిగా ఉన్నాయని తెలిపారు.

కానీ, ఇప్పుడు ముందుమాట‌లో కేసీఆర్ పేరు ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోతోందని ధ్వజమెత్తారు. దాదాపు 2 కోట్ల‌కు పైగా పుస్త‌కాలు వెనక్కి తెప్పించిన‌ట్లు తెలుస్తోందని... అలా చేయడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. ఇప్పుడున్న పుస్తకాలు మార్చాలంటే కొత్త కమిటీలను వేయాలని... కానీ ఇప్పటికిప్పుడు అలా వేయడానికి సమయం కూడా లేదన్నారు. వచ్చే ఏడాది పుస్తకాలను మార్చి... మీ పేర్లు పెట్టుకోవచ్చునని సూచించారు. విగ్రహాలు... గుర్తుల మార్పు అనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. తమకు భేషజాలు లేవని చెప్పే రేవంత్ ఇప్పుడు చేస్తుందేమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News