Ayyanna Patrudu: కొత్త వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడంపై అయ్యన్న కామెంట్స్ ఇవిగో...!

Ayyanna Patrudu interesting comments on latest developments

  • ఎన్నికల్లో కూటమి సమష్టి విజయం సాధించిందన్న అయ్యన్న
  • ఈ ఐదేళ్లలో వేధించిన అధికారులను వదిలేది లేదని వార్నింగ్
  • కొత్త మంత్రులకు మనస్ఫూర్తిగా మద్దతిస్తామని వ్యాఖ్యలు

ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించిందని, ఇక తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడంపై దృష్టి సారిస్తుందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై అయ్యన్న హుందాగా స్పందించారు. తాను గతంలో మంత్రిగా చేశానని, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారని, కొత్త మంత్రులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. 

నాడు ఎన్టీ రామారావు తనకు 25 ఏళ్ల వయసులో మంత్రి పదవి ఇచ్చారని, మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? ఇప్పుడూ అంతే... జూనియర్లు ఎదగాలనే మేం కోరుకుంటాం అని అయ్యన్న వ్యాఖ్యానించారు. కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే సీనియర్లం మేమెందుకు బాధపడతాం... మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, కొత్త మంత్రులకు అండగా నిలుస్తాం అని పేర్కొన్నారు. 

ఇది మూడు పార్టీల కూటమి సాధించిన విజయం అని స్పష్టం చేశారు. అంతే తప్ప, ఈ గెలుపును పవన్ కల్యాణ్ విజయం అని, చంద్రబాబు విజయం అని, మోదీ విజయం అని చెప్పకూడదని అన్నారు. ఇది ఏ ఒక్కరి వల్ల సాధించిన విజయం కాదని, ఇది సమష్టి విజయం అని అయ్యన్నపాత్రుడు వివరించారు. ఈ ఎన్నికల సమరంలో ఒకరిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనలేమని, ముగ్గురు నేతలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలుస్తారని అయ్యన్న చమత్కరించారు. 

తనకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తామని తెలిపారు. వైసీపీకి ప్రజలు ఎప్పుడో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని, ఈ ఐదేళ్లలో చాలా ఓవర్ గా ప్రవర్తించిన కొందరు అధికారులు ఉన్నారని... ముఖ్యంగా పోలీసు అధికారులు కొందరున్నారని పేర్కొన్నారు.  

చంద్రబాబు క్షమించినా, తాము మాత్రం క్షమించే ప్రసక్తేలేదని అన్నారు. గత ఐదేళ్లలో తమ కార్యకర్తలను ఊచకోత కోశారని, చంపేశారని వెల్లడించారు. ఎలాంటి కారణాలు లేకుండానే పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాంటి అధికారుల జాబితా తమ వద్ద ఉందని హెచ్చరించారు. అలాంటి అధికారులను వదిలిపెడితే చేతకానితనం అవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News