Nassau Stadium: న్యూయార్క్‌ క్రికెట్ స్టేడియం కూల్చివేత‌ షురూ.. ఇదిగో వీడియో!

Nassau Stadium Home To Tense T20 World Cup Matches Set For Demolition

  • 3 నెలల్లోనే న‌సావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌ నిర్మాణం 
  • దీని నిర్మాణం కోసం ఏకంగా రూ. 243 కోట్ల ఖర్చు
  • న్యూయార్క్ లో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లు ముగియ‌డంతో స్టేడియం కూల్చివేత‌ షురూ
  • ఇండో-పాక్ మ్యాచ్‌కు వేదికైన‌ అమెరికా క్రికెట్ స్టేడియం 

వెస్టిండీస్ తో కలిసి ఈసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కు అమెరికా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం న్యూయార్క్‌లో న‌సావు కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌ను కేవలం 3 నెలల్లోనే నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ. 243 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ స్టేడియంను కూల్చివేయ‌నున్నారు. న్యూయార్క్ లో జ‌ర‌గాల్సిన మ్యాచ్‌లు ముగియ‌డంతో ఆ స్టేడియాన్ని కూల్చివేసేందుకు క‌స‌రత్తులు సిద్ధం అయ్యాయి. బుధ‌వారం అమెరికాతో భార‌త్ ఆడిన మ్యాచే ఆ వేదిక‌లో చివ‌రిది. గురువారం నుంచి ఈ పాక్షిక స్టేడియాన్ని క్ర‌మంగా తొల‌గించ‌నున్నారు. న‌సావు స్టేడియాన్ని తొల‌గించేందుకు ఇప్పటికే అక్క‌డ‌కు భారీ సంఖ్య‌లో బుల్డోజ‌ర్లు కూడా చేరుకున్నాయి.

ఇక ఈ పిచ్‌పై ఆడిన అన్ని జ‌ట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అనూహ్య‌మైన బౌన్స్ ఉన్న ఈ స్టేడియంలో బౌల‌ర్లే పైచేయి సాధించారు. బ్యాట‌ర్ల‌కు ప‌రుగులు తీయ‌డం క‌ష్టం అయ్యింది. పిచ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మైదానంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్‌లు జ‌రిగాయి. దీంట్లో అన్నీ లో స్కోరింగ్ మ్యాచ్‌లే ఉన్నాయి.  మైదానంలో ఉన్న ప‌చ్చికను అడిలైడ్‌ నుంచి తీసుకువ‌చ్చి ఇక్క‌డ ప‌రిచారు. 

ప‌ది ర‌కాల డ్రాప్ ఇన్ పిచ్‌ల‌తో ఇక్క‌డ మైదానాన్ని నింపేశారు. దీంట్లో నాలుగు గ్రౌండ్లు ప్ర‌ధాన‌మైన‌వి కాగా, ఆరు శిక్ష‌ణ కోసం వాడారు. బుధ‌వారం మ్యాచ్ త‌ర్వాత క్ర‌మ ప‌ద్థ‌తిలో న‌సావు స్టేడియాన్ని తొల‌గించ‌నున్నారు. మైదానం నుంచి తీసిన ప‌చ్చిక లాస్ వెగాస్‌కు త‌ర‌లించ‌నున్నారు. ఆరు వారాల వ్య‌వ‌ధిలో న‌సావు స్టేడియాన్ని పూర్తిగా నిర్మూలిస్తారు. ఈ స్టేడియం సామ‌ర్థ్యం 34 వేలు. జూన్ 9వ తేదీన భార‌త్, పాక్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కు ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. చిత్ర‌విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఈ వేదిక‌గా భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. న‌సావులో అత్యధిక రన్స్ ఛేజ్ కూడా టీమిండియానే చేసింది. నిన్నటి అమెరికాపై భార‌త్ ఛేజింగ్‌లో 111 ర‌న్స్ స్కోర్ చేసింది.

  • Loading...

More Telugu News