Gandhi Statue Vandalized: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన ముందు ఖలిస్థానీల దుశ్చర్య!

Mahatma Gandhis bust in Italy vandalised by Khalistani extremists ahead of modi visit

  • జూన్ 13 - 15 మధ్య ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశాలు
  • ఈ సమావేశాల్లో పాల్గొననున్న మోదీ, 
  • ప్రధాని పర్యటన నేపథ్యంలో ఖలిస్థానీ వేర్పాటు వాదుల దుశ్చర్య
  • స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం సగ భాగం ధ్వంసం, విగ్రహ పీఠంపై వివాదాస్పద నినాదాల రాతలు

ప్రధాని మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్థానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహంలో సగ భాగాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు. ఇటీవల హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు. అయితే, విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు. ఇటలీలో జూన్ 13 - 15 మధ్య జరగనున్న 50వ జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. 

కాగా, ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా స్పందించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతేడాది కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లోని ఓ యూనివర్సిటీ కాంపస్‌లో కూడా ఖలిస్థానీ వాదులు ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాంపై అభ్యంతరకర రాతలు రాశారు. 
 
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఇక జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొనడం ఇది వరుసగా ఐదోసారి. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్ - రష్యా , ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధాలు ప్రధానాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News