Harish Rao: 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని కేవలం 11 వేలకే నోటిఫికేషన్ ఇచ్చారు: హరీశ్ రావు
- ఇచ్చిన మాట ప్రకారం 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
- పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి
- స్కూళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సూచన
డీఎస్సీ ద్వారా 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 11 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు ఆయన పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. 'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి... ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.
అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలన్నారు. స్కూళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్పోరేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతోందన్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.