VH: చంద్రబాబుకు వి.హనుమంతరావు ప్రశంస... పవన్ కల్యాణ్‌కు సూచన

VHR applauds Chandrababu for promoting BCs in Cabinet

  • చంద్రబాబు తన కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారన్న వీహెచ్
  • బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలన్న కాంగ్రెస్ నేత
  • చంద్రబాబు ఎన్ఎస్‌యూఐ నేత స్థాయి నుంచి నాలుగోసారి సీఎం అయ్యారని వ్యాఖ్య
  • ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ బాగా కష్టపడ్డారన్న వీహెచ్

చంద్రబాబు తన కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశంసించారు. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ కలిసి బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆలోచన కూడా అదే (బీసీలకు న్యాయం) అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరగాలని, కులగణన జరిగి... జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, అందుకే కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వచ్చారని, అందుకే తమకు ఆహ్వానం అందకపోవచ్చునని వీహెచ్ అభిప్రాయపడ్డారు. యువజన కాంగ్రెస్ నేత స్థాయి నుంచి ఎదిగిన చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా బీసీ కులగణన చేస్తామని గతంలో చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా కులగణనపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగి బడుగు, బలహీనవర్గాలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన శిష్యుడు కాదని... కొలీగ్ అన్నారు. ఆయన కష్టపడ్డారని, ఎన్నో అవమానాలు పడ్డారన్నారు. భట్టివిక్రమార్కలాగా కొట్లాడారని ప్రశంసించారు. 

ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. రాజకీయాల్లో జరిగిన పొరపాట్లను అధిగమించి ముందుకు సాగినట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీగా కష్టపడి అధికారంలోకి వచ్చారని తెలిపారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ తెలంగాణలో వినిపిస్తోందని... ఇందుకు తాను మద్దతిస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన తర్వాత ఎన్నికలు జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబు, నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్‌లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా కొట్లాడాలని సూచించారు.

  • Loading...

More Telugu News