Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. పాక్ ఉగ్రవాదికి క్షమాభిక్ష నిరాకరించిన రాష్ట్రపతి ముర్ము

President Murmu denies mercy for Pakistan terrorist

  • 2000 డిసెంబరు 22న ఎర్రకోటపై దాడి
  • లష్కరే ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
  • మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు
  • భారత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన పాక్ ఉగ్రవాది

ఇరవై నాలుగేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోసిపుచ్చారు. 

ఈ కేసులో పాక్ టెర్రరిస్టు మహ్మద్ ఆరిఫ్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2022 నవంబరు 3న అతడి రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో, అతడికి మరణశిక్ష ఖరారైంది. ఈ నేపథ్యంలో, మే 15న ఆరిఫ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాభిక్ష కోరాడు. అయితే అతడి పిటిషన్ ను ముర్ము మే 27న తోసిపుచ్చగా, మే 29న ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 

2000 సంవత్సరం డిసెంబరు 22న ఎర్రకోట వద్ద నెం.7 రాజ్ పుటానా రైఫిల్స్ సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు భారత జవాన్లు మరణించారు. 

ఈ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు పాక్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేశారు. అతడు నిషిద్ధ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడు అని గుర్తించారు. ఆరిఫ్ ఈ దాడికి ఇతర మిలిటెంట్లతో కలిసి కుట్ర పన్నాడన్న అభియోగాలు కోర్టులో నిరూపణ అయ్యాయి. 

ఆనాడు ఎర్రకోటపై దాడికి పాల్పడిన అబు షాద్, అబు బిలాల్, అబు హైదర్ వేర్వేరు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు.

Mercy Petition
President Of India
Droupadi Murmu
Mohammed Arif
Terrorist
LeT
Red Fort
Attack
New Delhi
India
Pakistan
  • Loading...

More Telugu News