Chandrababu: చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరు, వైఎస్ షర్మిల

YS Sharmila and Chiranjeevi Wishes to CBN and Pawan Kalyan

  • సిబీఎన్, పవన్ కు 'ఎక్స్' వేదికగా చిరంజీవి, వైఎస్ షర్మిల కంగ్రాట్స్ 
  • ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ చిరు ట్వీట్
  • ఒక బహిరంగ లేఖ విడుదల చేసిన షర్మిల
  • ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా పాలన సాగాలన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భరంగా సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా 'ఎక్స్'(ట్విట్టర్ ) ద్వారా టీడీపీ అధినేతకు కంగ్రాట్స్ చెప్పారు. 

"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను.!!" అంటూ చిరు ట్వీట్ చేశారు. అలాగే తన భార్య సురేఖ, తనయుడు రాంచరణ్ లతో కలిసి చంద్రబాబును కలిసిన ఫొటోలను చిరంజీవి పంచుకున్నారు.   


ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక లేఖ విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను కాపాడాలి. గత అయిదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాను. పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు" అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. 

More Telugu News