Mohammed Muizzu: భారత పర్యటన విజయవంతం.. మాల్దీవుల అధ్యక్షుడి ప్రకటన
- నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మహ్మద్ ముయిజ్జు
- రాష్ట్రపతి, విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం
- ఈ పర్యటనతో ఇరు దేశాల దౌత్యబంధాలు బలోపేతమవుతాయని ఆశాభావం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తన పర్యటన విజయవంతమైందని అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాల దౌత్యబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు.. అనేక భారత వ్యతిరేక నిర్ణయాలతో దౌత్య వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ తన ప్రమాణస్వీకారం కోసం పలువురు దేశాధి నేతలను ఆహ్వానించారు. ఇందులో మాల్దీవుల అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇక భారత పర్యటన సందర్భంగా ముయిజ్జు.. నరేంద్ర మోదీతో పాటు, రాష్ట్రపతి ముర్ము, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఇక మోదీతో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశంలో ఇరు నేతల మధ్య పలు ద్వైపాక్షిక, దౌత్య అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. అనంతరం, ఏర్పాటు చేసిన విందుకు మోదీ, ముయిజ్జు కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పక్క పక్క సీట్లలో ఆసీనులయ్యారు. ఈ పర్యటన మాల్దీవులతో పాటు ఈ ప్రాంతానికి ప్రయోజనకరమని పేర్కొన్నారు.
అండమాన్ దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మోదీ పర్యటనతో ఇరు దేశాల దౌత్య వివాదం ప్రారంభమైన విషయం తెలిసిందే. మోదీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకోవడంతో భారతీయుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో, అనేక మంది ద్వీపదేశాన్ని బహిష్కరించారు. దీంతో, భారతీయ పర్యాటకుల రాకడ తగ్గిపోయి మాల్దీవుల పర్యాటకంపై పెను ప్రభావం పడింది.