Vande Bharat: వందేభారత్ ట్రైన్ కూ తప్పలేదు.. జనంతో కిక్కిరిసిన బోగీలు

Ticketless Passengers Overcrowd Vande Bharat Express

  • టికెట్ లేకున్నా రిజర్వ్ డ్ కోచ్ లోకి ఎక్కిన జనం
  • లక్నో- డెహ్రాడూన్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

దూర ప్రయాణాలు చేయాలంటే మధ్యతరగతి ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది రైలు.. తక్కువ ఖర్చుతో కాస్త సౌకర్యంగా ప్రయాణించే వీలుండడమే దీనికి కారణం. అయితే, కరోనా తర్వాత సాధారణ రైళ్లను, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీలను రైల్వే శాఖ కుదించింది. దీంతో జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు కూడా రిజర్వ్ డ్ బోగీల్లోకి ఎక్కుతున్నారు. ఫలితంగా స్లీపర్ కోచ్ లు కూడా జనరల్ బోగీలను తలపిస్తున్నాయి. ఇటీవల ఏసీ త్రీ టైర్ కోచ్ కూడా జనరల్ బోగీని తలపించేలా కిక్కిరిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇప్పుడు ఈ బెడద వందేభారత్ లాంటి ప్రీమియం ట్రైన్లను కూడా వదల్లేదు. తాజాగా లక్నో- డెహ్రాడూన్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ లో కాలుపెట్టేందుకు కూడా జాగాలేకుండా జనం ఎక్కిన వీడియోను అర్చిత్ నగర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఈ వీడియోలో.. కేంద్ర రైల్వే శాఖ తాజాగా తీసుకొచ్చిన వందేభారత్ స్లీపర్ ట్రైన్ కనిపిస్తోంది. ప్రీమియం ట్రైన్ కావడంతో వందేభారత్ ట్రైన్ కు సీట్లకు సరిపడా టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. అయితే, ట్రైన్ లో చూస్తే మాత్రం సాధారణ ప్యాసింజర్ రైలులాగే జనం కిక్కిరిసిపోయారు. 

వారంతా టికెట్ తీసుకోకున్నా ట్రైన్ ఎక్కారని, ప్రీమియం రైళ్లలో కూడా ఇలా ఉంటే ఎలా అంటూ అర్చిత్ నగర్ అనే ప్రయాణికుడు వాపోయాడు. జనరల్ బోగీకన్నా అధ్వానంగా మారిన ఈ పరిస్థితిని చూపిస్తూ.. వేల రూపాయలు పోసి టికెట్ కొనడం దేనికని ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రైళ్లు తీసుకురావాల్సింది పోయి ఉన్న రైళ్లనే తగ్గిస్తే సామాన్యులు ప్రయాణించడం ఎలాగంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రైల్వే శాఖ, కేంద్ర మంత్రి స్పందించి రైళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Vande Bharat
Ticketless Passengers
Overcrowded Train
Viral Videos

More Telugu News