Chandrababu: వేదికపై 60 మంది.. అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లు

Huge arrangements are being made for Chandrababus swearing in Ceremony

  • అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు
  • విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, తదితర కేంద్ర పెద్దలు
  • ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణం
  • భారీ భద్రత ఏర్పాట్లు.. విధుల్లో 10 వేల మంది పోలీసులు


మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు నాలుగవ సారి సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. కార్యక్రమం జరగనున్న కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదిక అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు 50 వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని సిద్ధం చేశారు. 

విజయవాడ చేరుకున్న అతిథులు
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖలు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు.  మరోవైపు భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరికీ సభావేదికపై దృశ్యాలు కనిపించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు.

అతిథులకు గ్రీన్ రూమ్‌లు..
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూములను సిద్ధం చేశారు. ఆ గదులను ప్రముఖులకు కేటాయించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో ఒక గ్రీన్‌ రూమ్‌‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్‌ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్‌ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరొక రూమ్‌ను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కోసం ఒక గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్‌ రూమ్‌ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

భారీ భద్రత
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవనున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. విజయవాడకు 3 వేల మందిని పంపించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరవల్లి సభా ప్రాంగణం, వెలుపల 7 వేల మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. 60 మందికిపైగా ఐపీఎస్‌లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News