Kinjarapu Ram Mohan Naidu: తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తా... ఈ బంధం కొనసాగాలి: రామ్మోహన్ నాయుడు
- తెలంగాణ సీఎం, ఎంపీలు, కేంద్రమంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తే పరిష్కరిస్తానని హామీ
- సివిల్ ఏవియేషన్స్ మినిస్ట్రీ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే అవకాశం దక్కిందని వ్యాఖ్య
- తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానన్న రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తాను ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఎంపీలు, కేంద్రమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి... ఇలా ఎవరి నుంచి తనకు విజ్ఞప్తులు వచ్చినా మరో ఆలోచన లేకుండా ఆ ప్రాంతానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తన సహకారంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారని... ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
'ఆ అనుబంధం (ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య) ఎప్పుడూ కొనసాగించాలి. సివిల్ ఏవియేషన్స్ మంత్రిత్వ శాఖ ద్వారా మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. తెలంగాణపై కూడా దృష్టి పెడతాను. అక్కడ (తెలంగాణ) ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తా'నని కేంద్రమంత్రి అన్నారు.
పార్లమెంట్‌లో నేను మాట్లాడింది ఏపీ ప్రజలూ విన్నారు
గతంలో పార్లమెంట్‌లో తాను మాట్లాడుతూ, 'రెండు నిమిషాలు టైమివ్వండి... భవిష్యత్తులో ఎంతమంది ఎంపీలు కావాలో తీసుకువస్తాను' అని చెప్పానని... నాటి తన మాటలను స్పీకర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నారని వ్యాఖ్యానించారు. అందుకే నాడు ముగ్గురు ఎంపీల నుంచి ఈ రోజు 21 మంది ఎన్డీయే ఎంపీలను గెలిపించారన్నారు. అందుకే ఏపీ ప్రజలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.