Chandrababu Naidu: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు: చంద్రబాబు
- ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న టీడీపీ అధినేత
- రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపించారని ప్రశంస
- పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనన్న చంద్రబాబు
ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు.
ఇక పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలసి పనిచేశామన్నారు. దాంతో ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం అన్నారు. అటు బీజేపీ పోటీచేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది సత్తాచాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.