Kamran Akmal: భజ్జీ దెబ్బకు దిగొచ్చిన పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌.. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు!

Kamran Akmal apologizes to Harbhajan Singh and Sikh community for controversial remarks on Arshdeep Singh

  • భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో కమ్రాన్ అక్మల్‌ విద్వేషపూరిత వ్యాఖ్యలు
  • సిక్కు కమ్యూనిటీని అవమానించేలా అక్మల్ కామెంట్స్
  • వాటిపై సోషల్ మీడియా వేదికగా దుమారం  
  • ఈ కాంట్రవర్సీ లో భజ్జీ కల్పించుకుని గట్టి కౌంటర్
  • తన తప్పు తెలుసుకుని వెంటనే క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ తో పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ కమ్రాన్ అక్మల్‌ దిగొచ్చాడు. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, సిక్కు కమ్యూనిటీని అవమానించేలా అక్మల్ కామెంట్స్ చేశాడు. వాటిపై సోషల్ మీడియా వేదికగా దుమారం చెలరేగడంతో పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ కాంట్రవర్సీ విషయంలో భజ్జీ కల్పించుకుని గట్టి కౌంటర్ ఇవ్వడంతో అక్మల్ దెబ్బకు దిగొచ్చాడు. తన తప్పు తెలుసుకుని వెంటనే క్షమాపణలు కోరాడు.

న్యూయార్క్ వేదికగా జూన్ 9న భారత్ - పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో విజయం ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో కమ్రాన్ అక్మల్ ఏఆర్ వై న్యూస్ ఛానెల్‌లో జరిగిన ప్యానెల్ డిస్కషన్‌ లో పాల్గొన్నాడు. సరిగ్గా చివరి ఓవర్‌ ను టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో సిక్కుల కమ్యూనిటీని అవమానించేలా, తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. "ఏదైనా జరగొచ్చు. టైం ఆల్రెడీ 12 అయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఏ సిక్కుకూ బౌలింగ్ ఇవ్వరాదు" అంటూ కామెంట్స్ చేశాడు.

ఒక మతాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అవి కాస్తా హర్భజన్‌ సింగ్ కు చేరడంతో మనోడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. "నీ చెత్త నోరు తెరిచే ముందు ఒకసారి సిక్కుల చరిత్ర తెలుసుకో. అర్ధరాత్రి 12 గంటలకు ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు కాపాడిన చరిత్ర సిక్కులది. నీకు కొంచెం కూడా అభిమానం లేకపోవడం సిగ్గు చేటు" అని ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు.

దీంతో యావత్ సిక్కుల కమ్యూనిటీనే అవమానించేలా చేసిన కామెంట్లపై అక్మల్ రియలైజ్ అయ్యాడు. "నేను హర్భజన్ సింగ్, సిక్కుల కమ్యూనిటీలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నాను. నా మాటలు అవమానించేలా, తప్పుగా ఉన్నాయని తెలుసుకున్నాను. నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులపై చాలా గౌరవముంది. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అలా అనలేదు. అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అంటూ రిప్లై ఇచ్చాడు.

More Telugu News