Raghu Rama Krishna Raju: వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది: గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

Raghu Rama Krishna Raju complains to Guntur SP

  • గతంలో ఓసారి రఘురామను అదుపులోకి తీసుకున్న సీఐడీ
  • కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారన్న రఘురామ
  • సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్ లపై ఆరోపణలు
  • తగిన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో ఓసారి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

ఈ హత్యాయత్నానికి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని వివరించారు. 

అంతేకాదు, కస్టడీలో తనకు గాయాలైతే, ఆ గాయాలపై గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని రఘురామ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకు కొంతకాలానికి వైసీపీ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. ఓ దశలో ఆయన సొంత నియోజకవర్గంలో ఉండలేక ఢిల్లీ వెళ్లిపోయారు. ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ... టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.

More Telugu News