Revanth Reddy: రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి: రేవంత్ రెడ్డి
- రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి
- పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని ఆదేశం
- కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచన
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ జరగాలన్నారు. పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు.
కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఏసీఎస్ నుంచి కూడా పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశించారు. పంద్రాగస్ట్ నాటికి రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.