Biren Singh: మణిపూర్ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడి!
- కంగ్పోక్పి జిల్లాలో సోమవారం ఉదయం ఘటన
- దాడిలో సెక్యూరిటీ సిబ్బంది ఒకరికి గాయాలు
- ఇటీవల హింస చోటుచేసుకున్న జిరిబమ్‌కు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో దాడి
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సెక్యూరిటీ కాన్వాయ్‌పై అనుమానిత మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. కంగ్పోక్పి జిల్లాలో సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో సెక్యూరిటీ సిబ్బంది ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హింస చోటుచేసుకున్న జిరిబమ్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి వెళ్ళాల్సి వుంది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలిపారు.
రక్షణ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ దాడిని తిప్పికొట్టాయి. జాతీయ రహదారి 53పై ఉన్న కొట్లెన్ గ్రామం వద్ద ప్రస్తుతం ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఎదరుకాల్పుల్లో బుల్లెట్ల గాయాల వల్ల ఒక జవాన్ గాయపడ్డారు.
సీఎం బీరేన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇంకా ఇంఫాల్‌కు చేరుకోవాల్సి ఉంది. జిరిబమ్‌కు ఆయన వెళ్లనున్నారు. శనివారం రోజున మిలిటెంట్లు రెండు పోలీసు ఔట్‌పోస్టులు, ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసు, 70 ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో వందలాది మంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి తరలిపోయారు.
కాగా, ఈ నెల 6న గుర్తుతెలియని దుండగులు స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని అతి కిరాతంగా హతమార్చడంతో జిరిబమ్‌లో గత కొన్ని రోజులుగా అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.