Ajit Pawar: కేంద్ర కేబినెట్‌లో దక్కని చోటు.. ఎన్సీపీలో అసంతృప్తి!
- కేబినెట్ మంత్రి పదవి ఆశించిన ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గానికి నిరాశ
- బీజేపీ ఆఫర్ చేసిన స్వతంత్ర హోదా మంత్రి పదవిని నిరాకరించిన పవార్
- తమ ఎంపీ గతంలోనే కేబినెట్ మంత్రిగా ఉన్నారన్న పవార్
- కేబినెట్ విస్తరణ సమయంలో ఎన్సీపీని పరిగణనలోకి తీసుకుంటామన్న బీజేపీ
కేంద్ర కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేబినెట్ పదవి కోసం ఆశపడితే కేంద్రం కేవలం స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఆఫర్ చేయడంతో అజిత్ పవార్ తిరస్కరించారు. అయితే, కేబినెట్ పోస్టు కోసం తాము కేబినెట్ విస్తరణ జరిగే వరకూ వేచి చూస్తామని అన్నారు.
మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అజిత్ పవార్ వర్గం ముఖ్య భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీ 4 స్థానాల్లో బరిలో నిలిచి ఓ స్థానంలో గెలుపొందింది. పార్టీ తరపున కేంద్రంలో మంత్రి పదవి చేపట్టేందుకు ప్రఫుల్ పటేల్ పేరును ఎన్సీపీ ఖరారు చేసింది. అయితే, బీజేపీ మాత్రం స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఎన్సీపీ వర్గాలు నిరాశ చెందాయి.
ప్రస్తుతం తమకు ఒక లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారని అజిత్ పవార్ అన్నారు. మరో మూడు నెలల్లో తమ ఎంపీల సంఖ్య నాలుగుకు చేరుతుందన్నారు. కాబట్టి, తమకు కేబినెట్ పదవి ఇవ్వడం సముచితమేనని అభిప్రాయపడ్డారు.
కాగా, దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ‘‘ఎన్సీపీకి స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవిని ఆఫర్ చేశారు. కానీ వారు కేంద్ర మంత్రి పదవి కోసం ప్రఫుల్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఆయన గతంలోనే కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి, స్వతంత్ర హోదా కలిగిన సహాయమంత్రి పదవిని స్వీకరించలేమని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు కూటమి పార్టీలను కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందు కోసం ఒక విధానాన్ని అనుసరిస్తున్నాము. ఒక పార్టీ కోసం ఈ విధానాన్ని మార్చలేం కదా. అయితే మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఎన్సీపీని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని అన్నారు.
తనకు కేబినెట్ పదవి దక్కకపోవడంపై ప్రఫుల్ పటేల్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మాకు స్వతంత్ర హోదా మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు గత రాత్రి సమాచారం అందించారు. నేను ఇప్పటికే కేబినెట్ మంత్రిగా చేశాను. ఇది నాకు డిమోషన్ వంటిది. ఇదే విషయాన్ని బీజేపీకి తెలియజేశాం. వారు మమ్మల్ని కొన్ని రోజులు వేచి చూడమని సలహా ఇచ్చారు. దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు’’ అని పటేల్ అన్నారు.