Narendra Modi: మోదీ కేబినెట్లో సహాయమంత్రి పదవికి నో చెప్పిన ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్!
- బీజేపీ, ఎన్సీపీ మధ్య గందరగోళం లేదని స్పష్టీకరణ
- కొన్నిరోజులు వేచి చూడాలని బీజేపీ పెద్దలు చెప్పారన్న ప్రఫుల్ పటేల్
- తమకు ఒక క్యాబినెట్ పదవి రావాలన్న అజిత్ పవార్
నరేంద్రమోదీ కొత్త కేబినెట్లో ఎన్సీపీకి ప్రాతినిథ్యం దక్కలేదు. ఎన్సీపీకి సహాయమంత్రి పదవిని ఆఫర్ చేశారు. అయితే తాను గతంలోనే కేంద్రమంత్రిగా పని చేశానని... ఈసారి సహాయమంత్రి పదవి ఇస్తాననడంపై ప్రఫుల్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎన్సీపీకి మోదీ 3.0 కేబినెట్లో చోటు దక్కలేదు. అయితే, భవిష్యత్తులో ఎన్సీపీకి కేబినెట్లో ప్రాధాన్యత దక్కుతుందని బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు.
బీజేపీ, ఎన్సీపీల మధ్య గందరగోళం లేదు: ప్రఫుల్ పటేల్
కేంద్రమంత్రి పదవి దక్కకపోవడంతో ఎన్సీపీ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై ప్రఫుల్ పటేల్ స్పందిస్తూ... బీజేపీ, ఎన్సీపీ మధ్య ఎలాంటి గందరగోళం లేదని, ఇదసలు సమస్యే కాదని స్పష్టం చేశారు.
నిన్న రాత్రి తనకు సహాయమంత్రి పదవిని ఇస్తున్నట్లు చెప్పారని... కానీ తాను గతంలోనే క్యాబినెట్ మంత్రిగా పని చేసినందున ఈ పదవిని తీసుకోలేనని చెప్పానన్నారు. ఈ విషయమై తాము బీజేపీ పెద్దలకు సమాచారం ఇచ్చామని... కొన్నిరోజులు వేచి చూడమని వారు తమకు చెప్పారన్నారు.
పార్లమెంట్లో ఎగువ సభను కూడా పరిగణనలోకి తీసుకుంటే తాము మొత్తం నలుగురం ఎంపీలం ఉన్నామని... తమకు ఒక క్యాబినెట్ పదవి ఇవ్వాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. తాము ఈ విషయాన్ని బీజేపీ నాయకత్వంతో చర్చంచామని... వారు కూడా అంగీకరించినట్లు చెప్పారు. క్యాబినెట్ మంత్రి పదవి కోసం కొన్నిరోజులు వేచి చూస్తామన్నారు.