Daggubati Purandeswari: తనకు లోక్ సభ స్పీకర్ పదవి అంటూ ప్రచారంపై పురందేశ్వరి స్పందన
- కేంద్ర క్యాబినెట్ లో ఏపీకి సరైన ప్రాతినిధ్యం లభించిందన్న పురందేశ్వరి
- శ్రీనివాసవర్మ వంటి నిజమైన కార్యకర్తకు కేంద్ర మంత్రి పదవి లభించిందని హర్షం
- లోక్ సభ స్పీకర్ పదవి గురించి అడిగితే... రెండు చేతులు జోడించిన పురందేశ్వరి
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. కేంద్ర క్యాబినెట్ కూర్పు చక్కగా, ఏపీ నుంచి సరైన ప్రాతినిధ్యం లభించిందని, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారని పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు క్యాబినెట్ లో చోటు లభించడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్యకర్తగా కష్టపడి పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి టికెట్ ఇవ్వడం నుంచి, ఇవాళ అతడిని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవడం వరకు ప్రతి బీజేపీ కార్యకర్తకు ఎంతో ఉత్తేజం కలిగించే అంశమని తెలిపారు.
"ఏపీలో మేం కూటమిగా పోటీ చేశాం. కేంద్ర క్యాబినెట్ కూర్పు నేపథ్యంలో, టీడీపీ వాళ్లు రెండు పేర్లు ఇచ్చారు... వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి బీజేపీ కార్యకర్తగా అంకితభావంతో పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మను కూడా క్యాబినెట్ లోకి తీసుకున్నారు.
ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులుగా అవకాశం దక్కించుకున్న వాళ్లు కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఏపీకి నిధులు సాధించడానికి వీరంతా తమ వంతు కృషి కచ్చితంగా చేస్తారు.
అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు ఎంతో అవసరం. ఇక్కడ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. గడచిన ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా కుంటుపడిందో, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో... ఆ లోటును అధిగమించేందుకు పెద్ద ఎత్తున వనరులు తెచ్చుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది" అని పురందేశ్వరి వివరించారు.
ఇక, మీకు లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట కదా అనే ప్రశ్నకు పురందేశ్వరి మౌనంతోనే సమాధానమిచ్చారు. మీడియా రిపోర్టర్ రెండుసార్లు ఈ ప్రశ్న అడగ్గా, ఆమె రెండు సార్లు చేతులు జోడించి "నమస్కారం" అనే రీతిలో నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు.