Bhupathiraju Srinivasa Varma: నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి

Narsapur MP Bhupathiraju Srinivasa Varma gets NDA minister post

  • ఈ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన శ్రీనివాసవర్మ
  • ఎన్డీయే క్యాబినెట్ లో చోటు ఖరారు
  • ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్న శ్రీనివాసవర్మ

ఏపీ నుంచి మరో ఎంపీకి కేంద్రంలో మంత్రి పదవి ఖరారైంది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర క్యాబినెట్ లో చోటు లభించింది. 

ఈ ఎన్నికల్లో బీజేపీ... టీడీపీ, జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడి బరిలో దిగిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్  ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎంపీగా గెలిచారు. ఇప్పుడాయనను కేంద్ర మంత్రి పదవి వరించింది. 

శ్రీనివాసవర్మ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1991 నుంచి 1995 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు భీమవరం టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 1999 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 

1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంటు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీనివాసవర్మ పనితీరుకు మెచ్చి ఆయనను 2001లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

2009లో శ్రీనివాసవర్మ బీజేపీ టికెట్ పై లోక్ సభకు పోటీ చేశారు. 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018 నుంచి 2020 వరకు బీజేపీ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 

ఇక, 2020 నుంచి 2023 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున నరసాపురం నుంచి బరిలో దిగి ఎంపీగా విజయం సాధించారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

  • Loading...

More Telugu News