Ramoji Rao: రామోజీరావుగారు నన్ను ఎంతగానో అభిమానించేవారు: బాబూ మోహన్
- రామోజీరావును అభిమానించే కోట్లాదిమందిలో తానూ ఒకడినని వెల్లడి
- ఫిలిమ్ సిటీకి వస్తే తాను కచ్చితంగా కలిసి వెళ్లేవాడినన్న బాబూ మోహన్
- ఫిలిమ్ సిటీలో కాలానికి తగినట్లు మార్పులు చేశారన్న మాజీ మంత్రి
- ఇందిరాగాంధీ ఎమర్జెన్సీపై ఈనాడు ద్వారా రామోజీరావు నిజాలు చెప్పారన్న నాగబాబు
- కలంతో కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఘనత ఆయనదేనని వ్యాఖ్య
రామోజీరావు తనను ఎంతగానో అభిమానించేవారని మాజీ మంత్రి బాబూ మోహన్ అన్నారు. శనివారం రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆయనను అభిమానించే కోట్లాది మందిలో తానూ ఒకడిని అన్నారు. రామోజీ ఫిలిమ్ సిటీకి వస్తే తాను కచ్చితంగా ఆయనను కలిసే వెళ్లేవాడినన్నారు. తాను మంత్రి అయ్యాక వెళ్లి కలిస్తే చాలా సంతోషించారని గుర్తు చేసుకున్నారు. ఫిలిమ్ సిటీలో కాలానికి తగినట్లుగా సరికొత్త మార్పులు తీసుకు వచ్చారన్నారు.
కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు అవస్థలు పెడితే మొనగాడిలా ముందుకు సాగారు: నాగబాబు
రామోజీరావు పత్రికా రంగపు లెజెండ్ అని నాగబాబు అన్నారు. జర్నలిస్ట్ విలువలకు అర్థం చెప్పిన వ్యక్తి అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో... సామాన్యుడు తన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించేందుకు వణికిపోయిన రోజున కూడా, రామోజీరావు ఈనాడు ద్వారా నిజాలను నిర్భయంగా ప్రచురించారన్నారు. సోషల్ మీడియా లేని సమయంలో మీడియాను శాసించిన ఘనత రామోజీరావుదే అన్నారు.
ఎన్టీఆర్ సీఎం కావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. కలంతో కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఘనత రామోజీరావుదే అన్నారు. పత్రికా రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఆరోపణలు చేసి... హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆది నుంచి తుది వరకు... కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు వ్యవస్థలు ఆయనను ఎన్ని అవస్థలు పెట్టినా మొనగాడిలా ముందుకు సాగారే తప్ప వెనుకడుగు వేయలేదన్నారు.
మనిషి బతికున్నంత కాలం పని చేస్తూనే ఉండాలని ఎంతోమందికి మార్గనిర్దేశనం చేశారన్నారు. ఆయన ఎన్నో రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించారన్నారు. ఆయన మరణం తెలుగు జాతికి, పత్రికా ప్రపంచానికి తీరని లోటు అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.