CS Neerabh Kumar Prasad: చంద్రబాబు వద్ద సీఎస్ గా పనిచేసే అవకాశం రావడం ఆనందం కలిగిస్తోంది: నీరబ్ కుమార్

Neerab Kumar responds on appointed as AP CS

  • ఏపీ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం
  • నేడు బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి
  • చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష 

ఓవైపు చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉండగా, ఏపీలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పందించారు. 

సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు వంటి విజనరీ నేత వద్ద సీఎస్ గా పనిచేసే అవకాశం రావడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడం వంటి అంశాలపై సమీక్ష జరిపినట్టు వెల్లడించారు. 

ప్రధాని మోదీ వస్తున్నందున భద్రతకు సంబంధించి డీజీపీకి సూచనలు చేశానని సీఎస్ పేర్కొన్నారు. పలువురు సీఎంలు వస్తున్నందున ప్రొటోకాల్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వీఐపీలకు ఒక్కో బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. 

చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం రెండు స్థలాలను పరిశీలించామని, మంగళగిరి ఎయిమ్స్, గన్నవరం విమానాశ్రయం వద్ద స్థలాలు పరిశీలించామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయం వెలువడగానే యుద్ధ ప్రాతిపదికన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని సీఎస్ నీరబ్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News