Kadiam Srihari: నా తండ్రి పేరుకు మచ్చతేకుండా ముందుకు సాగుతా: కడియం కావ్య
- ఎంపీగా తన గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కావ్య
- సీపీఎం, సీపీఐ కూడా తనకు మద్దతిచ్చాయన్న కావ్య
- గుడిసెవాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ
తన తండ్రి కడియం శ్రీహరి పేరుకు మచ్చలేకుండా తాను ముందుకు సాగుతానని వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కడియం కావ్య అన్నారు. ఎంపీగా తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు.
ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ... తాను సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతుతో గెలుపొందానన్నారు. పట్టణంలోని గుడిసెవాసుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లు కాంగ్రెస్ కోసం ఎలాగైతే పని చేస్తానో... కమ్యూనిస్ట్ ల కోసం కూడా అంతే పని చేస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ వాళ్లు బీజేపీ గెలుపుకు కృషి చేశారు: కొండా సురేఖ
బీఆర్ఎస్ నేతలు పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు వల్లే కాంగ్రెస్ రెండు సీట్లు కోల్పోయిందన్నారు.