Narendra Modi: రాష్ట్రపతి ముర్మును కలిసిన నరేంద్ర మోదీ... ఎన్డీయే తీర్మానం అందజేత

Narendra Modi met president Droupadi Murmu

  • కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరిన మోదీ
  • మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ముర్ము
  • మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్న జేపీ నడ్డా, చంద్రబాబు తదితరులు

కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీయే సభా పక్ష నేత నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.   ఎన్డీయే మిత్రపక్షాల తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా... మోదీ విజ్ఞప్తికి రాష్ట్రపతి ముర్ము స్పందిస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని లాంఛనంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, మూడోసారి ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్న మోదీకి రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో, నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించేందుకు కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు.

More Telugu News