Sunil Chhetri: చివ‌రి మ్యాచ్‌.. క‌న్నీరు పెట్టుకున్న భార‌త సాక‌ర్ స్టార్ సునీల్ ఛెత్రి!

Sunil Chhetri bids farewell to national team

  • సాల్ట్ లేక్ స్టేడియంలో చివ‌రి మ్యాచ్ ఆడిన భార‌త ఫుట్‌బాట్ స్టార్
  • ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భాగంగా కువైట్‌తో మ్యాచ్‌
  • గోల్ లేకుండానే ముగిసిన కీల‌క మ్యాచ్‌ 
  • మ్యాచ్ అనంత‌రం భావోద్వేగానికి గురైన సునీల్‌ ఛెత్రి

భార‌త ఫుట్‌బాట్ స్టార్ సునీల్ ఛెత్రి త‌న చివ‌రి మ్యాచ్ ఆడారు. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భాగంగా కోల్‌క‌తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కువైట్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌ను భార‌త్ 0-0తో ముగించింది. ఇది దిగ్గజ సారథి చివరి మ్యాచ్ కావడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో ఏకంగా 58,291 మంది ప్రేక్షకులు హాజరు కావ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇరుజ‌ట్లు స‌మంగా పోరాడాయి. దీంతో మ్యాచ్ గోల్‌ లేకుండానే ముగిసింది. కాగా, రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భారత్ తన చివరి గేమ్‌లో జూన్ 11వ తేదీన ఖతార్‌తో తలపడనుంది.

సాక‌ర్ వీరుడు భావోద్వేగం..
ఇక మ్యాచ్ అనంత‌రం భావోద్వేగానికి గురైన 39 ఏళ్ల సునీల్‌ ఛెత్రి క‌న్నీరు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ అభిమానుల‌కు ధన్యవాదాలు తెలిపాడు. స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ఆయ‌న‌కు గార్డ్ ఆఫ్ ఆన‌ర్ ఇచ్చారు. దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు 151 మ్యాచులు ఆడిన ఈ స్టార్ సాక‌ర్ ప్లేయ‌ర్ 94 గోల్స్ చేశాడు. ఓవ‌రాల్‌గా అత్య‌ధిక గోల్స్ చేసిన నాలుగో ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. అత‌ని కంటే ముందు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో (128 గోల్స్), ఇరాన్‌కు చెందిన అలీ డేయి (108), అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ (106) వంటి దిగ్గజాలు ఉన్నారు.

More Telugu News