T20 World Cup 2024: కోహ్లీ ఈ విధంగా ఔట్ కావడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- ఐర్లాండ్‌పై ఒకే ఒక్క పరుగు చేసి ఔటైన విరాట్
- టీ20 వరల్డ్ కప్ భారత్ ఛేజింగ్‌లో కోహ్లీ 50 లోపు పరుగులకు ఔట్ కావడం 8 ఏళ్లలో ఇదే తొలిసారి
- 2016లో న్యూజిలాండ్‌పై 23 పరుగులకు ఔటైన కోహ్లీ
- టీ20 వరల్డ్ కప్‌లో విరాట్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ రాణించడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. అద్భుతమైన విజయం సాధించినప్పటికీ విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం భారత ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.
ఐదు బంతులు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు కొట్టి వెనుదిరిగాడు. మార్క్ అడైర్ ఓవర్‌లో క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ పరుగులకే ఔట్ కావడం చాలా కాలం తర్వాత నమోదయింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 50 కంటే తక్కువ పరుగులు సాధించడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2016లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ 50 కంటే తక్కువ పరుగులు చేయలేదు. తిరిగి 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు.
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో కోహ్లీ బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. ఛేజింగ్‌లో అతడి సగటు ఏకంగా 180.66గా ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగా 542 పరుగులు బాదాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 82 పరుగులుగా ఉంది. ఇక స్ట్రైక్ రేట్ 134.49గా ఉంది. ఇందులో 49 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి.