Ayodhya Ram Temple: అయోధ్యవాసులు స్వార్థపరులు.. తమ రాజును ఎప్పుడూ మోసగిస్తారు: ‘రామాయణ్’ నటుడి మండిపాటు
- రామాలయం నిర్మించినా అయోధ్యలో బీజేపీని ప్రజలు ఓడించడంపై తీవ్ర ఆవేదన
- ఇన్ స్టా గ్రామ్ వేదికగా పలు స్టోరీలు, వీడియో పంచుకున్న సునీల్ లహ్రీ
- తాను అభిమానించే అరుణ్ గోవిల్, కంగనా రనౌత్ ఎంపీలుగా గెలవడంపై హర్షం
యూపీలోని అయోధ్యలో భారీ రామాలయం నిర్మించినా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరలేదు. అయోధ్య ఎంపీ స్థానంలో బీజేపీ ఓడిపోవడమే కాకుండా ఆ ప్రాంతంలోని 9 సీట్లకుగాను 5 స్థానాల్లో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో 1990ల నాటి ప్రఖ్యాత హిందీ సీరియల్ ‘రామాయణ్’లో లక్షణుడి పాత్ర పోషించిన నటుడు సునీల్ లహ్రీ స్పందించారు. అయోధ్యవాసులు బీజేపీకి బదులు సమాజ్ వాదీ పార్టీని గెలిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకోవడంతోపాటు పలు ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను నెటిజన్లతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన అయోధ్యవాసులను స్వార్థపరులుగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన బీజేపీని గెలిపించకపోవడాన్ని తప్పుబట్టారు. ‘లంకలో రావణుడి చెర నుంచి విముక్తి పొంది తిరిగొచ్చిన సీతా మాతను ఇదే అయోధ్యవాసులు అనుమానించారనే విషయాన్ని మనం మరచిపోయాం. దేవుడిని కూడా వద్దనుకొనే వారిని ఏమనాలి.. స్వార్థపరులనే పిలవాలి. అయోధ్యవాసులు ఎప్పుడూ తమ రాజును మోసగిస్తారనేందుకు చరిత్రే నిదర్శనం. వారు సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేశారు. మరో ఇన్ స్టా స్టోరీలో బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచి చంపిన మీమ్ ను పంచుకున్నారు.
అలాగే ఓ వీడియోలో సునీల్ స్పందిస్తూ ‘దేశంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఐదేళ్లపాటు నిరాటంకంగా పనిచేస్తుందా? ఏదేమైనా నేను అభిమానించే ఇద్దరు వ్యక్తులు ఈ ఎన్నికల్లో గెలిచారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించారు. అలాగే యూపీలోని మీరట్ నియోజకవర్గం నుంచి ‘రామాయణ్’ సీరియల్ లో రాముడి పాత్రధారి, నా సోదర సమానుడు అరుణ్ గోవిల్ గెలిచారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని సునీల్ లహ్రీ పేర్కొన్నారు.