Rohit Sharma: టీ20ల్లో చ‌రిత్ర సృష్టించిన‌ రోహిత్ శ‌ర్మ!

Three records created by Hitman Rohit Sharma as India beat Ireland

  • న్యూయార్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌
  • ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడు అరుదైన రికార్డుల‌ న‌మోదు 
  • అంత‌ర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు 
  • టీ20 ప్రపంచక‌ప్‌ల‌లో 1000 ర‌న్స్ 
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు 

బుధ‌వారం న్యూయార్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో 4 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాట‌ర్‌గా రికార్డుకెక్కాడు. అలాగే టీ20 ప్రపంచక‌ప్‌ల‌లో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేశాడు. 

దీంతోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇక నిన్న‌టి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 37 బంతుల్లోనే 52 ప‌రుగులు చేసి భార‌త జ‌ట్టుకు తొలి విజ‌యం అందించిన విష‌యం తెలిసిందే. అత‌ని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి. 

1. అంత‌ర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ 4వేల పరుగులు 
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆయ‌న ఈ ఘ‌న‌త సాధించాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు విరాట్ కోహ్లీ, బాబ‌ర్ ఆజామ్ ఈ మార్క్‌ను దాటారు. 4038 ర‌న్స్‌తో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉంటే.. 4025 ప‌రుగులతో రోహిత్ రెండో స్థానంలో, 4023 ప‌రుగులతో బాబ‌ర్ మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే త‌క్కువ బంతుల్లో 4వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి ఆట‌గాడిగానూ రోహిత్ రికార్డుల‌కెక్కాడు. ఇక ఈ పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్ 5 శ‌త‌కాలు, 30 అర్ధశతకాలు బాదాడు. 

2. టీ20 ప్రపంచక‌ప్‌ల‌లో రోహిత్ శర్మ 1000 ర‌న్స్
టీ20 ప్రపంచక‌ప్‌ల‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ శ‌ర్మ‌ ఒకడు. విరాట్ కోహ్లి (1142 పరుగులు), మహేల జయవర్ధనే (1016 పరుగులు) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా ప్రారంభ ఎడిషన్ నుండి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఆడుతున్న హిట్‌మ్యాన్‌ 36.25 సగటుతో 1,015 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

3. అంతర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌ 600 సిక్సర్ల రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట‌ర్‌గా అరుదైన రికార్డును రోహిత్ శ‌ర్మ‌ నమోదు చేశాడు. త‌న‌దైన శైలిలో సిక్స‌ర్లు కొట్టి 'హిట్‌మ్యాన్‌'గా పేరు తెచ్చుకున్న‌ రోహిత్ శర్మ టెస్టుల్లో 84 సిక్సర్లు, వ‌న్డేల‌లో 323 సిక్సర్లు, టీ20ల్లో 193 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 553 సిక్సర్లతో రోహిత్ తరువాతి స్థానంలో విండీస్ స్టార్ ఆట‌గాడు క్రిస్ గేల్ ఉన్నాడు.

  • Loading...

More Telugu News