Nara Lokesh: 1985 తర్వాత మంగళగిరిలో పసుపు జెండా ఎగిరింది: నారా లోకేశ్

Nara Lokesh speech after victorious in Mangalagiri
  • మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ విజయం
  • 91 వేల పైచిలుకు మెజారిటీతో లోకేశ్ గెలుపు
  • ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతను అప్పగించారని వెల్లడి 
మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెగ్గిన అనంతరం నారా లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై పవిత్రమైన బాధ్యతను ఉంచారని తెలిపారు. 

దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, సంక్షేమం-అభివృద్ధి రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లడానికి ఈ బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని భావిస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి తామందరం అహర్నిశలు కష్టపడతామని, కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ఈ మూడు పార్టీలు ఐక్యంగా కృషి చేస్తాయని లోకేశ్ ఉద్ఘాటించారు. 

"మంగళగిరి విషయానికొస్తే... 1985 తర్వాత ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులందరి కృషితో ఈ రోజు 91 వేల పైచిలుకు మెజారిటీతో నేను గెలిచాను. నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇది మూడో అత్యధిక మెజారిటీ. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రికార్డులు సృష్టించింది. 

గాజువాక నుంచి మా నేత పల్లా శ్రీనివాసరావు 95 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తెలుస్తోంది. రెండోస్థానంలో... భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గారు 92 వేల మెజారిటీతో గెలిచారు. మెజారిటీ పరంగా నేను మూడో స్థానంలో ఉన్నాను. 

ఎవరూ ఊహించనంత మెజారిటీతో మంగళగిరిలో గెలిచి ఈ స్థానాన్ని కూటమికి కానుకగా ఇస్తానని చంద్రబాబుకు, పవనన్నకు హామీ ఇచ్చాను. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకున్నాను. ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలు నాకున్నాయని భావిస్తున్నాను. ఇచ్చిన హామీల ప్రకారం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చే ఐదేళ్ల పాటు అనేక పనులు చేయాల్సి ఉంది. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Mangalagiri
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News