Narendra Modi: మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు... ఇదొక చారిత్రక ఘట్టం: ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పదేళ్లుగా చేసిన మంచి పనులను కొనసాగిస్తామని హామీ
- ఒడిశా ప్రజలకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ థ్యాంక్స్
- కార్యకర్తల కష్టాన్ని మాటల్లో చెప్పలేమన్న మోదీ
ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని, భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత పదేళ్లలో చేసిన మంచి పనులను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని... వారి కష్టాన్ని మాటల్లో చెప్పలేమన్నారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రజలకు కూడా ప్రధాని మోదీ థ్యాంక్స్ చెప్పారు. సుపరిపాలనకు, ఒడిశా ప్రత్యేక సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన విజయం ఇది అన్నారు. ప్రజల కలలను నెరవేర్చడంలో, ఒడిశాను ప్రగతిపథంలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో బీజేపీ ఏ అంశాన్ని వదిలి పెట్టదని హామీ ఇచ్చారు. ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్నారు.