Mallikarjun Kharge: లోక్‌సభ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తొలి స్పందన ఇదే
- ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి నైతికి ఓటమి అన్న కాంగ్రెస్ చీఫ్
- మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు వచ్చిందని వ్యాఖ్య
- బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదని విమర్శించిన ఖర్గే
లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైతిక ఓటమి అని వ్యాఖ్యానించారు. మోదీకి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు వచ్చిందని అన్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం మోదీకి నైతిక, రాజకీయ ఓటమి అని ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో పార్టీ సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్‌లతో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కాగా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో రేపు (బుధవారం) కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. భాగస్వామ్య పార్టీలను సంప్రదించకుండా తాము ఎలాంటి ప్రకటనా చేయబోమని, కూటమి సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6.30 గంటల సమయానికి ఎన్డీఏ కూటమి 117 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోగా.. మరో 177 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక ప్రస్తుతానికి 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 168 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రస్తుతం ట్రెండ్స్‌ను బట్టి బీజేపీ ఒంటరిగా 241 స్థానాలను మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇండియా కూటమి అనూహ్య రీతిలో పుంజుకొని గట్టి పోటీనిస్తోంది. 231 స్థానాలు గెలుచుకునే దిశగా అది పరుగులు పెడుతోంది. ఇప్పటికి 49 సీట్లను గెలుచుకున్న ఇండియా కూటమి పార్టీలు.. మరో 182 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.