Israel: తమ పౌరులను మాల్దీవులు నిషేధించడంపై ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్
- హమాస్ పై భీకర దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్
- పాలస్తీనాకు పెరుగుతున్న ప్రపంచదేశాల మద్దతు
- తమ దేశంలోకి ఇజ్రాయెల్ పౌరులు రావొద్దంటూ మాల్దీవుల నిషేధాజ్ఞలు
- లక్షద్వీప్ వెళ్లాలంటూ తమ పౌరులకు సూచించిన ఇజ్రాయెల్
పాలస్తీనా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పాలస్తీనా గడ్డపై సాధారణ పౌరులు కూడా సమిధలుగా మారుతున్నారంటూ అనేక దేశాలు ఇజ్రాయెల్ ను నిరసిస్తున్నాయి.
ఈ క్రమంలో, ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడంపై మాల్దీవులు నిషేధం విధించింది. అయితే, మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తమ పౌరులు భారత్ లోని లక్షద్వీప్ వెళ్లాలని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే... "ఇకపై ఇజ్రాయెల్ దేశస్థులను అనుమతించబోమని మాల్దీవులు ప్రకటించింది. అందుకే మీ కోసం భారతదేశంలోని కొన్ని సుందరమైన బీచ్ ల వివరాలను అందిస్తున్నాం. ఈ భారత బీచ్ లలో ఇజ్రాయెల్ పర్యాటకులకు హార్దిక స్వాగతం లభిస్తుంది. అత్యంత ఘనమైన ఆతిథ్యం అందిస్తారు. ఇప్పటివరకు మన దౌత్యవేత్తలు పర్యటించిన ప్రాంతాల ఆధారంగా ఈ బీచ్ లను సిఫారసు చేస్తున్నాం" అంటూ భారత్ లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది.
అంతేకాదు, లక్షద్వీప్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, కేరళ బీచ్ ల ఫొటోలను కూడా పంచుకుంది.