KTR: నల్గొండలో వాటర్ ట్యాంకులో మృతదేహం... అసమర్థ ప్రభుత్వమంటూ కేటీఆర్ ఆగ్రహం

KTR fires at Nalgonda Mission Kakatiya dead body issue

  • నల్గొండలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో పదిరోజులుగా మృతదేహం
  • తాగునీటిలో తేడా కనిపించడంతో వాటర్ ట్యాంకు పరిశీలన... మృతదేహం లభ్యం
  • కాంగ్రెస్ పాలకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 'నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం' అంటూ వచ్చిన కథనాన్ని రీట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దాదాపు పదిరోజులుగా ప్రజలు అవే నీళ్లు తాగుతున్నారు. తాగునీటిలో తేడా కనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానికులు వాటర్ ట్యాంకును పరిశీలించగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అంతకుముందు నాగార్జునసాగర్‌లో మంచినీటి ట్యాంకులో 30 కోతులు పడి చనిపోయాయి. నీళ్ల విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు. కోతల్లేని కరెంట్ ఇవ్వరు... కోతకొచ్చిన పంటకు సాగునీళ్లివ్వరు... కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు... చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వానిది... ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి సమస్యను తీరిస్తే... కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా వీరికి చేతకావడం లేదన్నారు. ఇదో అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరు మారకపోతే ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.

  • Loading...

More Telugu News