Kedar Jadhav: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్

India cricketer Kedar Jadhav announces retirement from all forms of cricket

  • అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై
  • ‘ఎక్స్ ’వేదికగా రిటైర్మెంట్ ప్రకటన చేసిన జాదవ్
  • భారత్ తరపున 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు చేసిన క్రికెటర్

భారత క్రికెటర్ కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ ప్రకటన తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా జాదవ్ ప్రకటించాడు. తన క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన, ప్రేమాభిమానాలు అందించిన ప్రతి ఒక్కరికీ జాదవ్ కృతజ్ఞతలు తెలిపాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్ అయినట్టుగా పరిగణించాలని కోరాడు. కాగా జాదవ్ ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు.

కాగా కేదార్ జాదవ్ చివరిసారిగా 2020లో భారత్ తరపున న్యూజిలాండ్‌పై మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌ వేదికగా 2019 ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా కీలక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లలో జాదవ్ ఒకడిగా కొనసాగాడు. మొత్తం 73 వన్డే మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సాధించాడు. 101.6 స్ట్రైక్ రేట్‌, 42.05 సగటుతో 1389 పరుగులు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే 9 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 123.23 స్ట్రైక్ రేట్‌తో కేవలం 122 పరుగులు మాత్రమే సాధించాడు. 2019 వరల్డ్ కప్‌లో కీలక ఆటగాడిగా ఉన్న జాదవ్ ఆ తర్వాత రాణించలేకపోయాడు. ఇక ఆ తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్‌ కోసం జట్టు రూపొందించే క్రమంలో జాదవ్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

ఇక ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వేటలో కేదార్ జాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 ద్వితీయార్ధంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున జాదవ్ చివరిసారిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున కూడా ఆడాడు. ఐపీఎల్ కెరియర్‌లో మొత్తం 95 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 4 అర్ధసెంచరీలు సాధించాడు. 123.14 స్ట్రైక్ రేట్‌తో 1208 పరుగులు సాధించాడు. ఇక ఈ మధ్య జియో సినిమాకు మరాఠీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News