Counting: రేపు ఐదారు గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయి: ఏపీ సీఈవో మీనా

AP CEO Mukesh Kumar Meena held press meet ahead of counting
  • ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్
  • రాష్ట్రంలో రేపు కౌంటింగ్
  • తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

రేపు (జూన్ 4) సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 

రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరించారు. 

మొదట నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుందని చెప్పారు. అటు, చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆఖరున వెలువడతాయని, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి 29 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తుండడమే అందుకు కారణమని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. 

దాదాపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు. 

"పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పటికీ, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అక్కడ్నించి రెండు రకాల ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతుంది. లోక్ సభ ఓట్లకు సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 2,443 కౌంటింగ్ టేబుళ్లు, అసెంబ్లీ ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 2,446 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశాం. 

కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి ఈవీఎం కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ వద్ద ఏఆర్వో, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. 

కౌంటింగ్ ఏజెంట్ల విషయానికొస్తే... 18 ఏళ్లకు పైబడిన వారే కౌంటింగ్ ఏజెంట్లుగా రావాల్సి ఉంటుంది. మంత్రి, మేయర్, చైర్ పర్సన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, గౌరవ పదవుల్లో ఉన్నవారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండరాదు. నిర్దేశిత నియోజకవర్గంలో ఓటరు అయి ఉండాలి, ఈ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి అనే నిబంధనలేవీ ఏజెంట్లకు లేవు... కేవలం 18 ఏళ్లు నిండిన వారైతే చాలు. 

ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఏజెంట్లకు పాస్ లు కూడా ఇచ్చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ముందే కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాళ్ల వద్ద రిపోర్ట్ చేయాలి. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్ ఉంటారు. 

కౌంటింగ్ హాల్లోకి వెళ్లేందుకు కౌంటింగ్ సిబ్బందికి, అభ్యర్థులకు, ఏజెంట్లకు, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన వాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈసీ అనుమతి ఉన్న మీడియా సిబ్బంది కూడా కౌంటింగ్ హాల్లో ప్రవేశించవచ్చు. 

ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియాకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేస్తాం. వారికి ఇప్పటికే పాస్ లు కూడా ఇచ్చేశాం. నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మీడియా సిబ్బంది నిర్దిష్ట సమయం పాటు కౌంటింగ్ హాల్లో ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు... కానీ ఇష్టం వచ్చినట్టు కౌంటింగ్ హాల్లో తిరగడం కుదరదు. 

అమలాపురం లోక్ సభ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. అందుకు సుమారు 9 నుంచి 10 గంటల సమయం పట్టనుంది. ఇక్కడ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

ఇక, రాజమండ్రి, నరసాపురం లోక్ సభ స్థానాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 5 గంటల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. వీవీ ప్యాట్ల లెక్కింపునకు అదనంగా మరో గంట, రెండు గంటల సమయం పడుతుంది. 

అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు విషయానికొస్తే... విశాఖ జిల్లా భీమిలి, నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గాల్లో అత్యధికంగా 26 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఫలితాలు వచ్చేందుకు 9 నుంచి 10 గంటలు పడుతుంది. 

అత్యల్పంగా కోవూరు, నరసాపురం నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ముగుస్తుంది. అందుకు 5 గంటల సమయం పడుతుంది. మొత్తమ్మీద చూస్తే... 111 నియోజకవర్గాల్లో ఐదారు గంటల్లోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది" అని ముఖేశ్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లను వివరించారు.

  • Loading...

More Telugu News