Sonia Gandhi: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై స్పందించిన సోనియాగాంధీ
- ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా రేపటి ఫలితాలు ఉంటాయన్న సోనియా గాంధీ
- జూన్ 4వ తేదీ వరకు అందరం వేచి చూద్దామని వ్యాఖ్య
- ఎగ్జిట్ పోల్స్ ప్రధాని మోదీ ఊహాజనిత ఫలితాలేనన్న రాహుల్ గాంధీ
రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ సోమవారం స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు జూన్ 4వ తేదీ వరకు అందరం వేచి చూద్దామని సూచించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధిస్తుందని వెల్లడించాయి.
ఈరోజు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ... 'లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆశాభావంతో ఉన్నాం. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నాం. వేచి చూద్దాం' అన్నారు.
అంతకుముందు, రాహుల్ గాంధీ కూడా ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు బోగస్ పోల్స్‌ను మోదీ ప్రచారంలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ప్రధాని మోదీ ఊహాజనిత ఫలితాలని ఎద్దేవా చేశారు. కూటమికి 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ రాజకీయ అభిప్రాయాలు తప్ప నిపుణులవి కాదన్నారు. వాస్తవాలు రేపు తెలుస్తాయన్నారు.